నేను నీతో అబద్దం చెప్పాను నేను బిజినెస్ టైకూన్ కాదు అంటూ.. మొత్తం కక్కేశాడు. అందుకోసమే ఎదురు చూస్తున్న హరిణి … ప్రామిసింగ్ రైటర్ శ్రీసుధామయి డిటెక్టివ్ స్టోరీస్ ” హనీ ట్రాపింగ్ ” (02 -12 -2018)

( 2 )
అది న్యూఢిల్లీ ఎయిర్ పోర్టు. ఢాకా వెళ్లడానికి విమానం సిద్దంగా ఉంది. ఢాకా వెళ్లే ప్రయాణీకులందరూ విమానంలో సీటుబెల్టులు పెట్టుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. విమానం గాలిలోకి ఎగిరింది. ప్రయాణీకులందరూ నిశ్చింతగా ఎవరి పనులలో వారు మునిగిపోయారు.
ముందువరుసలో ఉన్న అనిల్ అత్యవసరమైన పని మీద ఢాకా వెళుతున్నాడు. పని పట్ల ఎంతో నిబద్దత తో ఉండే అనిల్ ఆ వేళ ఎందుకో కలవరంగా కనిపిస్తున్నాడు. ఢాకాలో దిగగానే తాను చేయాల్సిన పని గురించి ఆదుర్దాగా ఉన్నాడు.
అంతలో అక్కడికి ఎయిర్ హోస్టెస్ వచ్చింది. అనిల్ ను చూసి నవ్వుతూ కూల్ డ్రింక్ అందించింది. ఆ ఎయిర్ హోస్టెస్ ను చూసిన అనిల్ తన ఆదుర్దా అంతా మరిచిపోయాడు. తన సొట్టబుగ్గలు కనిపించేటట్టు నవ్వుతూ అనిల్ ను ఆకట్టుకుంది. అది చూసిన అనిల్ తనను తాను మరిచిపోయాడు. తన పేరు హరిణి గా పరిచయం చేసుకుంది. ఎయిర్ హోస్టెస్ గా కొత్తగా చేరానని చెప్పుకొచ్చింది. అనిల్ తానొక బిజినెస్ టైకూన్ అని కంపెనీ పని మీద అత్యవసరంగా ఢాకా వెళుతున్నానని చెప్పాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక అనిల్ కు విమానంలో వడ్డించే పదార్థాలన్నింటినీ వలపువన్నెలను కలిపి కొసరి కొసరి వడ్డించింది. మొత్తానికి ఢాకాలో విమానం దిగేలోపు అనిల్ హరిణి లిరువురూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చారు.
ఆ సాయంకాలం అనిల్ తన లాప్ టాప్ లో ఏదో పని చేసుకుంటున్నాడు. అంతలో హరిణి హాయ్ అంటూ వీడియో లో పలకరించింది. హనీ ఇప్పుడు చైనీస్ రెస్టారెంట్ లో కలుద్దాం అంటూ ప్రపోజల్ పెట్టాడు అనిల్ . అందుకోసమే ఎదురు చూస్తున్నట్టున్న హరిణి వెంటనే ఒప్పేసుకుంది.
అలా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడంటే అప్పుడు వారిద్దరూ కలుసుకునేవారు.
మెల్లిగా ఒకరికొకరు వ్యక్తిగత వివరాలు ఇష్టాఇష్టాలు పంచుకున్నారు.
***
ఒకరోజు హరిణి అనిల్ కు ఫోన్ చేసింది. ఆ రాత్రి అనిల్ ను డిన్నర్ కు ఆహ్వానించింది. ఆ వేళ తాను రావడం ఎంతమాత్రం కుదరదని అనిల్ చెప్పగానే తన మాటలలో మధువును కలిపి మత్తులో ముంచింది. ఆ మత్తుకు చిత్తయిపోయాడు అనిల్ . ఆ రాత్రి డిన్నర్ అయిన తర్వాత విస్కీలో తన హస్కీవాయిస్ కలిపి అనిల్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఆ చాణక్యవ్యూహంలో అనిల్ చక్కగా చిక్కుకున్నాడు.
హరిణి మెల్లిగా నిజాయితీ ఒలకబోస్తూ తన రహస్యాలు అన్నీ చెప్పడం మొదలుపెట్టింది. తాగిన మత్తులో అవన్నీ వింటూ ఆ మాటలలో ఉన్న నిజాయితీకి కదిలిపోయాడు అనిల్ .
” హనీ నన్ను క్షమించు నేను నీలా ఉండలేకపోయాను. నేను నీతో అబద్దం చెప్పాను నేను బిజినెస్ టైకూన్ కాదు అంటూ.. తానేం చేస్తాడో ఎందులో పని చేస్తాడో మొత్తం కక్కేశాడు. అందుకోసమే ఎదురు చూస్తున్న హరిణి చిరుకోపంతో ఇప్పుడు చెప్పినదంతా కూడా నిజమే అని నమ్మకమేమిటి అని అడిగింది. మత్తులో మైమరిచిపోయిన అనిల్ నువు నమ్మాలంటే నీకు రుజువులు కావాలి అంతే కదా ” అన్నాడు. ఆ మాటలకు కిలకిల నవ్వుతూ అంతే కదా అని హొయలు పోయింది. రేపు ఈ సమయానికి నేనేమిటో తెలియచెప్పే రుజువులు నీ పాదాలముందు ఉంచుతాను హనీ అంటూ తాగి తూలుతూ వాలిపోయాడు అనిల్
మరుసటిరోజు తానెవరో రుజువు చేసే ఏవో పత్రాలు ,ఫైళ్లు అన్నీ హరిణి వద్దకు తీసుకొచ్చాడు అనిల్ . అవన్నీ చూసిన హరిణి వీటిలో ఉన్న విషయం ఏమిటో ఈ కోడ్ భాష నాకు అర్థం కాలేదు అయినా ఇలాంటివి ఎవరైనా సృష్టించగలరు అన్నది.
ఆ మాటలకు హరిణి తనను ఇంకా నమ్మడం లేదని అర్థం చేసుకున్న అనిల్ సరే నువ్వు నన్ను నమ్మాలంటే ఈ ఫైళ్లలో పత్రాలలో ఉన్న సమాచారాన్ని నీకు అర్థం అయ్యేటట్టు చేయాలి అంతే కదా అన్నాడు.
అంతే కదా అంటూ సమ్మోహనంగా నవ్వింది హరిణి. అయితే రేపు ద్వారక స్ట్రీట్ లో ఐదో నంబరు ఇంటి పక్కన ఒక చిన్న నెట్ సెంటర్ ఉంది మనం అక్కడ కలుసుకుందాం. ఇంకెక్కడ కలుసుకోవాలన్నా చాలా కష్టం. ఇందులో ఉన్నది బయటకు వస్తే ఎంతో ప్రమాదం. ఈ ఫైళ్లలో ఉన్నదంతా డీకోడ్ చేసి నీకు నా గురించి అర్థమయ్యేటట్టు చేస్తాను. అన్నాడు.
అందుకు సరేనని అక్కడినుండి వెళ్లిపోయింది హరిణి
***
మరుసటి రోజు నెట్ సెంటర్ కు వచ్చాడు అనిల్ . కొద్దిసేపటి తర్వాత హరిణి వచ్చింది. ఇక్కడ మనం తప్ప ఇంకెవరూ లేరు కదా అంటూ అమాయకంగా అడిగింది హరిణి. ఈ నెట్ సెంటర్ నా స్నేహితుడిదే. అప్పుడప్పుడూ నేను ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవరూ ఉండకుండా చూస్తాడు నా స్నేహితుడు. ఇప్పుడూ అంతే ఇక్కడ మనం తప్ప ఎవరూ లేరు అన్నాడు. సరే ఈ ఫైళ్లలో ఉన్న సమాచారాన్ని డీకోడ్ చేయడం మొదలుపెడదాం అంటూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు అనిల్ అతని చుట్టూ చేతులతో పెనవేసి తన వలలో చిక్కుకుని” నిల్ ” అయిపోనున్న అనిల్ ను జాలిగా చూసి అక్కడున్న ఫైళ్లను అందుకుంది.
***
అంతే క్షణాలలో వారు ఊహించని సంఘటన ఒకటి జరిగింది. ఆ ఫైళ్లను పత్రాలను వెనుకనుండి ఎవరో మెరుపువేగంతో లాగేసుకున్నారు. అది చూసి బిత్తరపోయిన హరిణి ఏదో అర్థమయినట్టు అక్కడనుండి అతివేగంగా బయటకు వెళ్లబోయింది. చల్లగా జారుకోబోతున్న హరిణిని నెట్ సెంటర్ ద్వారం వద్ద ఉన్న లేడీకమాండోలు పట్టుకుని చేతులకు సంకెళ్లు తగిలించారు. అనిల్ వైపు చూడను కూడా చూడకుండా తల దించుకుని ఆ లేడీ కమాండోల వెంట వెళ్లిపోయింది హరిణి.
అదంతా అయోమయంగా చూస్తున్న అనిల్ కు ఏమీ అర్థం కాలేదు.
అంతలో ఆ ఫైళ్లను లాక్కున్న వ్యక్తి అనిల్ ను చూస్తూ..
ఇలా శకుని తంత్రం లాంటి తీయని వ్యూహంలో చిక్కి మనదేశ రహస్యాలను, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పరువును పాకిస్తాన్ గూఢచారిణి నీ హనీ అయిన మోహిని చేతికి విపులంగా విడమరిచి అందించాలనుకున్నావా? CBI డైరెక్టర్ మిస్టర్ అనిల్ సాహూ అగర్వాల్
అనగానే అనిల్ కు నోట మాట రాలేదు.
తన గురించి తానేం చేస్తున్నాడో ఆ వ్యక్తి ఎలా తెలిసిందో అర్థం కాక మీరెవరో నిజంగా నన్ను కాపాడారు మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కావడం లేదన్నాడు.
ఆ మాటలకు పక్కనుండి అంతా నేను చెప్తాను సర్ బయటకొచ్చాడు.
హర్షా నువ్వు ఇక్కడా?? అంటూ ఆగిపోయిన అనిల్ ను చూస్తూ
అవును సర్ నేనే మన సిబిఐ హెడ్ ఆఫీస్ లో మీరు ఒకరోజు రాత్రి ఎవరితోనో చాలా క్లోజ్ గా మాట్లాడటం విన్నాను. ఆ తర్వాత మిమ్మల్ని మీ కదలికలను ఎంతో జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాను. ఎవరో పన్నిన వలలో మీరు చిక్కుకుంటున్నారని నాకు బలంగా అనిపించింది. మీ దగ్గర పని చేసే నేను మీకు ఈ విషయం గురించి హెచ్చరించే అధికారం నాకు లేదు. అందుకే “డిటెక్టివ్ సిద్దార్థ ” కు జరిగినదంతా చెప్పి మిమ్మల్ని ఎలాగైనా ఈ ట్రాప్ నుండి బయటకు తీసుకురమ్మని అర్థించాను అన్న హర్ష మాటలకు కన్నీటితో కదిలిపోతూ అనిల్ సాహూ అగర్వాల్ ఏదో అనబోయేంతలో..
డిటెక్టివ్ సిద్దార్థ మిగిలినదంతా నేను చెప్తాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు.
” హర్ష చెప్పిన తర్వాత ఒకరోజు నేను హరిణి ఉరఫ్ మోహిని విమానసేవికగా ఉన్న విమానం ఎక్కాను. అలా విమానంలో వెళ్లడం తనను గమనించడానికి మాత్రమే. తర్వాత మీ ఇద్దరు మాట్లాడుకునే విధానాన్ని మీరు వెళ్లిన హోటల్స్ కు రెస్టారెంట్లకు కూడా వచ్చి గమనించాను. మీ నుండి ఏదో సమాచారాన్ని రాబట్టాలనే ఆలోచనను మోహిని మాటలలో పసిగట్టాను. తర్వాత మీ ఫోన్లను ట్రాప్ చేసినప్పుడు మోహిని ఫోన్ లో ఎవరికో హామీ ఇవ్వడం విన్నాను అనిల్ నుండి సమాచారం అందుకోవడానికి ఈ రోజు చివరిరోజు అని చెప్పింది. ఆ తర్వాత మిమ్మల్ని నీడలా వెంటాడి మోహినిని అరెస్టు చేయించాను ” అని ముగించాడు సిద్దార్థ.
అదంతా విని పశ్చాత్తాపంతో తల దించుకున్నాడు అనిల్ సాహూ అగర్వాల్ . దేశానికి సంబంధించిన రహస్యాలను కాపాడుతూ దేశాన్ని రక్షించే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తానెంత పెద్ద తప్పు చేశాడో అర్థమై పశ్చాత్తాపభారంతో కుమిలిపోతున్న అనిల్ చేతిని పట్టుకుని బయటకు నడిపించుకు వెళ్లసాగాడు హర్ష.

( వచ్చేవారం మరో డిటెక్టివ్ కథ )

జ్వాలాముఖి…మంత్రాలదీవి జానపద నవల ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Jwalamukhi+Mantrala+Deevi
డిటెక్టివ్ సిద్దార్థ ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Detective+Siddartha
ఘోస్ట్ స్టోరీస్ .ఇ బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
http://kinige.com/book/Ghost+Stories+13
ప్రముఖరచయిత విజయార్కె రచనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

http://kinige.com/author/Vijayarke

డిటెక్టివ్ స్టోరీస్ ను మీరు ఇదే పేజీలో వున్న పేస్ బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు/లైక్ చేయవచ్చు/ట్విట్టర్ లో ట్వీట్ చేయవచ్చు/షేర్ చేసుకోవచ్చు/ LEAVE A REPLY ద్వారా మీ కామెంట్ పోస్ట్ చేయవచ్చు…స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయవచ్చు. …చీఫ్ ఎడిటర్

NO COMMENTS

LEAVE A REPLY